
ట్రాఫిక్‌కు అంతరాయం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రేణిగుంట– కడప రహదారి కరకంబాడి వద్ద కడప వైపు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపేసి ట్రాఫిక్‌ను తిరుపతి వైపు మళ్లించారు. కరకంబాడి వద్ద వాహనాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. రేపు జరిగే సీఎం కార్యక్రమానికి ఇప్పటి నుంచే వాహనాలను నిలిపివేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. అయితే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ వల్లే వాహనాలను ఆపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వాల్మీకి చరిత్ర పుస్తకావిష్కరణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థ ముద్రించిన ‘వాల్మీకి చరిత్ర’ పుస్తకాన్ని గురువారం వీసీ ఆచార్య చిప్పాడ అప్పారావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నిధులతో ప్రాచ్య పరిశోధన సంస్థ రఘునాథ నాయకుడు రాసిన ‘వాల్మీకి చరిత్ర’ను ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ గ్రంథాన్ని సంస్థ సంచాలకులు ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు వచనంలో భావానువాదం చేశారని తెలిపారు. వాల్మీకి మహర్షిగా మారకముందు ఆయన జీవన సరళిని విపులంగా ఇందులో వివరించారన్నారు. కిరాతకుడిగా జీవించిన వ్యక్తి సప్తర్షుల ప్రభావంతో మహర్షిగా మారి సంస్కృత ఆదికావ్యం రామాయణం నిర్మించిన చరిత్ర ఈ గ్రంథంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్వీయూ సెంట్రల్ లైబ్రరీ డైరెక్టర్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ముమ్మాటికీ అది దుర్మార్గం
తిరుపతి కల్చరల్: అడవుల్లో నక్సల్ ఏరివేత ముమ్మాటికి దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. గురువారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 కల్లా నక్సల్‌ను తుదముట్టిస్తామన్న కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలు గిరిజన ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. అటవీ ప్రాంతాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలన్న వైఖరితో కేంద్రం కుట్రచేస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఉభయసభల్లో వక్ఫ్ బిల్లుపై బుల్డోజ్ చేసి బిల్లు పాస్ చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు తిరువనంతపురంలో జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆక్వా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

ట్రాఫిక్‌కు అంతరాయం