పోలీస్‌ భవనాలు ఎప్పటికి పూర్తయ్యేనో.... | At What Time Completed Police Buildings Construction | Sakshi
Sakshi News home page

TS Special: పోలీస్‌ భవనాలు ఎప్పటికి పూర్తయ్యేనో....

Published Tue, Oct 5 2021 9:08 PM | Last Updated on Tue, Oct 5 2021 9:30 PM

At What Time Completed Police Buildings Construction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జిల్లాల ప్రకారం జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఏర్పడినా పక్కా భవనాలకు మాత్రం మోక్షం లభించడంలేదు. కొన్నిచోట్ల అద్దె భవనాల్లో ఎస్పీ కార్యాలయాలు కొనసాగుతుండగా, మరి కొన్ని జిల్లాల్లో ఇతర ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి.  కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలకు 2017–18లోనే పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ టెండర్లు పిలిచి పునాది రాళ్లు కూడా వేసింది. అయితే ఏళ్లు గడిచినా కొన్ని జిల్లాల్లో ఇంకా పనులే ప్రారంభం కాకపోవడంతో ఆయా జిల్లాల పోలీస్‌ యూనిట్లు, అధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

(చదవండి:  రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు)


ఐదేళ్లు గడిచినా... 
ఉమ్మడి వరంగల్‌ జిల్లా  పోలీస్టేషన్‌ను ఎస్పీ కార్యాలయం నుంచి అప్‌గ్రేడ్‌ చేసి కమిషనరేట్‌గా ప్రభుత్వం మార్చింది. అయితే పాత అర్బన్‌ ఎస్పీ కార్యాలయం నుంచి ప్రస్తుత కమిషనరేట్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదే కార్యాలయం పక్కన ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌ను కూల్చివేసి కొత్త కమిషనరేట్‌ నిర్మాణానికి 2017లో అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అక్కడ నిర్మాణ పనులు చేపట్టలేదు. అయితే కమిషనరేట్‌ పనులకు టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ నిర్మాణంపై వెనక్కి తగ్గడంతో పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఆ కంపెనీని టెండర్‌ నుంచి తొలగించేసింది. దీంతో అప్పటినుంచి రీ టెండర్‌కు ప్రయత్నం చేస్తున్నా ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండిపోయినట్టు హౌజింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా తెలిసింది. 

(చదవండి: ‘కన్ఫ్యూషన్‌ ఏం లేదు.. ఏ పార్టీలో చేరాలో స్పష్టత ఉంది’)


భూమి కేటాయింపులే ప్రధాన సమస్య....
జగిత్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఈ మూడు జిల్లాల్లో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్ల నిర్మాణానికి భూమి కేటాయింపు సమస్యగా మారినట్టు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెంలో విజయవాడ హైవే వైపు ల్యాండ్‌ పరిశీలించినా, పోలీస్‌ శాఖకు అనువుగా ఉండదని అధికారులు భావించినట్టు తెలిసింది. ఇకపోతే ఇదే సమస్య నిర్మల్‌లోనూ తలెత్తినట్టు హౌజింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. అక్కడ ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. అదే విధంగా జగిత్యాల జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నిర్మాణం టెండర్లు జరిగినా టెక్నికల్‌ సమస్య వల్ల రద్దు చేశారు. మళ్లీ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. ఇకపోతే మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల 70 శాతం, 80 శాతం పనులు పూర్తికాగా, మరికొన్ని చోట్ల 50 శాతం పనులు పూర్తయి మిగిలిన పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి.  

త్వరలోనే  అన్ని పూర్తి చేస్తాం..  
జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్ల భవన నిర్మాణాలకు చిన్నచిన్న అవాంతరాలున్నాయి. కొన్ని చోట్ల భూమి కేటాయింపు సమస్య ఉండగా, మరికొన్ని చోట్ల రీ టెండర్లు పిలుస్తున్నాం. అవికాకుండా మిగిలిన జిల్లాల్లో పోలీస్‌ కార్యాలయాల పనులు 80 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే అన్ని నిర్మాణాలు పూర్తిచేస్తాం.  
                                                – కోలేటి దామోదర్‌ గుప్తా, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement