చక్రస్నానం.. సర్వ పాప హరణం
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఉదయం దేవేరుల సమేత మలయప్ప స్వామికి చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ వేడుక నిర్వహించడం ఆచారం. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రాత్రి అశ్వవాహనంపై వీధి ఉత్సవం నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో ధ్వజావరోహణం
వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 26న ఎగురవేసిన ధ్వజాన్ని గురువారం రాత్రి కిందకు దింపారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాసుడు సీతారామ లక్ష్మణుల అవతారంతో తిరుచ్చి వాహనంపై ఊరేగారు. తిరుచ్చి వాహనం ముందు విష్వకనుడు, చక్రతాల్వార్‌లు దేవాలయ ప్రదక్షిణ చేస్తూ ధ్వజ స్తంభం వరకు వచ్చారు. ఆలయ అర్చకులు ధ్వజ స్తంభానికి విశేష పూజలు చేశారు. అర్చకులు యాగశాల నుంచి పూర్ణకుంభంతో వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆవహణం చేశారు. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు.
చక్రస్నానం.. సర్వ పాప హరణం


