కుల వివక్షపై ప్రత్యక్ష పోరాటం
బషీరాబాద్: ఆధునిక సమాజంలోనూ మితిమీరుతున్న కులవివక్షపై పోరాటానికి దళిత వర్గాలు సిద్ధమవ్వాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో దళిత సంఘాలతో కలిసి పూలే, అంబేడ్కర్ జనజాతర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్కయ్య మాట్లాడుతూ.. దేశంలో కులవివక్ష పెరిగిపోతుందన్నారు. భారత రాజ్యంగంలోని 14, 15 ఆర్టికల్స్ కులవివక్ష, అంటరానితనాన్ని నిషేధించించాయని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు అమానుష ఘటనలను నిరోధించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణ కులవివక్ష కోసం ప్రజా సంఘాలు, దళిత మేధావులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 11 పూలే జయంతి మొదలు అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు గ్రామ సభలు నిర్వహించి దళిత వర్గాలను సంఘటితం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సంజీవ్ కుమార్, కమలకుమార్, ఎడ్ల సురేశ్, శ్యామప్ప, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 11 నుంచి 14 వరకు గ్రామ సభలు
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య


