బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
● చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు ● పుట్ట మన్నుతెచ్చి హోమగుండాల ఏర్పాటు ● విశ్వక్సేనుడి ఆరాధనతో ఉత్సవాలను ప్రారంభించిన అర్చకులు
మొయినాబాద్: కలియుగదైవం.. చిలుకూరు బాలా జీ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు.. వేద మంత్రోచ్ఛరణతో దేవాలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పుట్ట బంగారం (పుట్టమన్ను) తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు. అందులో నవధాన్యాలు, పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. తరువాత విశ్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 7గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు సాగాయి. పూజా కార్యక్రమాలు కిరణాచారి, రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి, కృష్ణమూర్తి, అనిల్ పాల్గొన్నారు.
నేడు ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు ధ్వజారోహణం, శేషవాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభానికి గరుడ పఠాన్ని ఆరోహణం చేస్తారు. ఈసారి గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని.. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పష్టం చేశారు.


