అడవుల రక్షణ మన బాధ్యత
చెట్లను నరికితే మనకే నష్టం
● డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్ ● సంగాయపల్లి తండాగిరిజనులతో సమావేశం
ధారూరు: సాగుభూమి కోసం అడవులను నరికితే భవిష్యత్ తరాలకు ముప్పు తప్పదని, అడవులను కాపాడుకోవడం మన బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. బుధవారం ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలోని సంగాయపల్లి తండా గిరిజనులకు తన కార్యాలయంలో అడవిని నరకడం వల్ల కలిగే ముప్పును వివరించారు. సాగుభూమి కోసం చెట్లను నరికితే మీరే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. ఒక్క చెట్టును నరికినా తమ దృష్టికి వస్తుందన్నారు. అటవీ భూములకు హద్దులు నిర్ధరించి కందకాలు తవ్విస్తున్నామని తెలిపారు. ఇందుకు తండావాసులు సహకరించాలని కోరారు. కొంతమంది రాత్రివేళ అడవిలోకి ప్రవేశించి చెట్లను నరికివేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేయడం నేరమని పేర్కొన్నారు. అటవీ భూమిని సాగుభూమిగా మారిస్తే గూగుల్ మ్యాప్‌లో బయటపడుతుందన్నారు. ఇకపై చెట్లను నరకమని గిరిజనులు డీఎఫ్‌ఓకు హామీ ఇచ్చారు. సమావేశంలో ధారూరు రేంజర్ బీ రాజేందర్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


