వక్ఫ్ సవరణ చట్టాలను రద్దు చేయాలి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ ముస్లిం సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని ఆలంపల్లి ఈద్గా ఆవరణలో శాంతియుత నిరసన తెలిపారు. అనంతరం మత పెద్దలు, నేతలు మాట్లాడారు. భారత రాజ్యాంగం ముస్లింలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి నల్లచట్టాల వల్ల స్వాతంత్య్రానికి పూర్వం మన పూర్వీకులు ధార్మిక కార్యక్రమాల కోసం దానం చేసిన ఆస్తులు ఈ రోజు మనవి కాకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సవరించిన వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు ఎర్రవల్లి జాఫర్, తస్వర్‌అలీ, ఎండీ హఫీజ్, జాకీర్‌మోయినొద్దీన్, మహ్మద్ ఉస్మాన్, రఫీయొద్దీన్, ఫెరోజ్, రవూఫ్, ఎజాజ్, జైనొద్దీన్, అర్షద్ మౌలానా, ఆదాం, ఫయాజ్ పాల్గొన్నారు.
ఆలంపల్లి ఈద్గా వద్ద మాట్లాడుతున్న ముస్లింలు
ముస్లిం సంఘాల జేఏసీ డిమాండ్
వికారాబాద్‌లో నిరసన కార్యక్రమం


