భావిగి దేవా.. భక్తుల బ్రోవ
తాండూరు టౌన్: జిల్లాలోనే ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తాండూరు శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నారు. అందుకు ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఆలయ కమిటీ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయానికి వేలాది కుటుంబాలు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నాయి. 23వ తేదీ వరకు స్వామి వారి ఉత్సవాలు నిర్వహించేందు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
15వ తేదీ నుంచి ఉత్సవాలు
తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15, 16వ తేదీల్లో రాత్రి 10 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి పల్లకీ సేవ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గాంధీచౌక్ మీదుగా రాచన్న దేవాలయం వద్దకు వెళ్లి తిరిగి అదే మార్గంలో ఆలయానికి చేరుకుంటుంది. 19వ తేదీ రాత్రి రథోత్సవం, 20న బసవణ్ణ కట్ట సమీపంలో రాత్రి 2గంటలకు లంకాదహనం, అదే రోజు ఉదయం సరస్వతి శిశుమందిర్ ప్రాథమిక పాఠశాలలో పశు ప్రదర్శన జరుగుతాయి.
ఖ్యాతిగాంచిన పశువుల సంత
భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో పశువుల సంతకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సంతకు జిల్లాలోని పశువులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఎద్దులను రైతులు తీసుకువస్తారు. ఏటా జరిగే ఉత్సవాలలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగా జోడెడ్ల ధర పలుకుతుంది.
రథానికి ప్రత్యేక గుర్తింపు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత ఎత్తైన రథం తాండూరు భావిగి భద్రేశ్వరస్వామికి ఉంది. ఉగాది పండగ రోజు నుంచి రథం నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. దాదాపు 25 రోజుల పాటు పనులు కొనసాగుతాయి. ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్, అగ్నిమాపక, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించనున్నారు. పట్టణంలోని పురవీధులలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారు.
వైభవంగా నిర్వహిస్తాం
భావిగి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ నెల 14వ తేదీ నుంచి నిత్యాన్నదానం కోసం భవనం సిద్ధం చేశాం.
– పటేల్ కిరణ్‌కుమార్, ఆలయ కమిటీ చైర్మన్
ఆలయ నేపథ్యమిదీ..
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న భావిగి భద్రేశ్వరస్వామి మఠం ఉంది. 18వ శతాబ్దంలో అక్కడ జరిగే ఉత్సవాలను తిలకించేందుకు తాండూరు పట్టణానికి చెందిన పటేల్ బసణ్ణ ఎడ్ల బండి కట్టుకొని వెళ్లారు. దర్శనం చేసుకొని వెనుదిరుగుతుండగా స్వామి వారు వచ్చి ప్రసాదం తీసుకోమని చెప్పారని గాథలున్నాయి. అనంతరం బసణ్ణ తాండూరుకు వస్తుండగా ఎద్దుల బండి వెంటే స్వామి వారు వస్తున్నారు. ఆయన బండి ఎక్కమని కొరినా నడుచుకుంటునే తాండూరు వరకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆలయం వద్దనే స్వామి వారు అదృశ్యమయ్యారు. ఎంత వెతికినా జాడ కనిపించలేదు. దీంతో అక్కడే బసణ్ణ ఆలయ నిర్మాణం చేపట్టి గర్భగుడిని నిర్మించారు. ఇప్పటికీ అదే ఉంది. అప్పటి నుంచి ఏటా చైత్ర మాసంలో పౌర్ణిమ తరువాత వచ్చే మంగళవారం నుంచి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.
15 నుంచి తాండూరు భావిగి భద్రేశ్వర బ్రహ్మోత్సవాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన
ఆలయ కమిటీ నిర్వాహకులు
భావిగి దేవా.. భక్తుల బ్రోవ
భావిగి దేవా.. భక్తుల బ్రోవ
భావిగి దేవా.. భక్తుల బ్రోవ


