పట్టా భూములపై పట్టు
● హకీంపేట్ భూ బాధితులతోసబ్ కలెక్టర్ సమావేశం ● పరిహారం పెంచాలని రైతుల అభ్యర్థన ● ఎకరాకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ ● లేదంటే భూములిచ్చేది లేదని స్పష్టీకరణ
దుద్యాల్: తమ పట్టా భూముల జోలికి రావొద్దని మండల పరిధిలోని హకీంపేట్‌కు చెందిన రైతులు తేల్చిచెబుతున్నారు. పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పట్టా, అసైన్డ్ భూములు కలిగి ఉన్న కొంత మంది రైతులు ఇప్పటికే స్థలం అప్పగించి పరిహారం పొందారు. హకీంపేట్ గ్రామానికి చెందిన సుమారు 36 మంది రైతులు తమకు సంబంధించిన 50 ఎకరాల పట్టా భూమిని ఇచ్చేది లేదని గతంలోనే పలుమార్లు అధికారులకు తెలియజేశారు. దీంతో సదరు రైతులకు వారం రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు. పట్టా భూములు ఇవ్వాలని కోరారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం హకీంపేట్‌కు చెందిన 17 మందిని తాండూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి రప్పించారు. వీరితో సమావేశమైన తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్‌తో వ్యక్తిగతంగా ఒక్కొక్కరి అభిప్రాయం తెలుసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న తమ భూములకు ఎకరాకు రూ.2 కోట్లు చెల్లిస్తేనే ఇస్తామని కొంతమంది రైతులు తెలిపారు. మిగిలిన వారిలో కొందరు రైతులు ప్రభుత్వం నిర్ణయించిన (ఎకరాకు రూ.20 లక్షల చొప్పున) పరిహారం తీసుకుని, భూములు ఇచ్చేస్తున్నారు.
పరిహారం అందలేదు
పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా నాకున్న రెండున్నర ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపాను. ఇప్పటి వరకూ పరిహారం అందలేదు. పట్టా భూమి కూడా ఇవ్వాల్సిందేనని నోటీసులిచ్చారు. ఇదెక్కడి న్యా యం..? వరంగల్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన భూములకు ఎకరాకు రూ.2 కోట్లు ఇస్తున్నారు. మాకు అలాగే ఇవ్వాలి.
– రాకం యాదయ్య, రైతు, హకీంపేట్
ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు
హకీంపేట్ రైతులతోఈ నెల 11న సమావేశం నిర్వహించా. పట్టా భూములు కలిగిన 17మంది హాజరయ్యారు. తమ భూములు రోడ్డు పక్కన ఉన్నందున ఎకరాకు రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం అందరికీ ఒకే రకమైన న్యాయం వర్తిస్తుందని చెప్పాం. ఎక్కువ చేసి ఇవ్వడం సాధ్యం కాదు.
– ఉమాశంకరప్రసాద్, తాండూరు సబ్ కలెక్టర్
పట్టా భూములపై పట్టు
పట్టా భూములపై పట్టు


