నీటి కుంట.. తీరేను చింత
దౌల్తాబాద్: వాగులు వంకల ద్వారా వృథాగా పోయే వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నదులపై ప్రాజెక్టులు, వాగులపై చెక్‌డ్యాంలు నిర్మిస్తుంది. ఈ క్రమంలో భూగర్భజలాలు పెంపునకు రైతులు పాంపాండ్స్ తవ్వుకునేలా ప్రోత్సహిస్తోంది. తద్వారా బోర్లు, బావులు రీఛార్జి అవడంతో పాటు కుంటల్లోని నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నీటికుంట (పాంపాండ్స్)లతో రైతులకు నీటిచింత తీరుతుందని ఉపాధి హమీ అధికారులు చెబుతున్నారు. రైతులు నయాపైసా ఖర్చు లేకుండా వీటిని నిర్మించుకోవచ్చంటున్నారు. మండలంలోని పలువురు రైతులకు మంజూరైనప్పటికీ వారికి అవగాహన లేక తవ్వుకునేందుకు ఆసక్తి చూపడంలేదు ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్నారు. భూమి పోతుందనే ఆలోచనతో చాలా మంది రైతులు ముందుకు రావడంలేదు.
ప్రయోజనాలు
రైతులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా తమ పొలాల వద్ద నిర్మించుకునే చిన్న కుంటలను పాంపాండ్స్ అంటారు. బోరు బావులు, వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులకు వీటితో ఉపయోగాలుంటాయన్నారు. వ్యవసాయ క్షేత్రంలోని సాగు భూమిలో కొంతపోయినా భూగర్భజలాలు పెరుగుతాయి. భారీ వర్షాలకు భూమి కోతతకు గురికాకుండా ఉంటుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చి నీరు గుంతలో చేరుతోంది. కుంటలో చేరిన మట్టి పొలాలకు ఎరువుగా ఉపయోగపడుతోంది. బోరుబావుల నుంచి కొద్దిపాటి నీరు వచ్చినా నీటి కుంటలను నింపుకొని ఒకేసారి పంటలకు నీటి తడులు అందించే వీలుంటుంది. దీంతో ఎకరాకు అవసరమయ్యే నీటితో రెండెకరాలు సాగు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. నీటికుంటలతో వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలకు ఢోకా ఉండదని పేర్కొంటున్నారు.
దరఖాస్తు చేసుకుంటే చాలు..
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో రైతులకు ప్రయోజనం చేకూర్చే నీటికుంటల నిర్మాణానికి రైతులు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. వర్షపు నీటిని పల్లపు ప్రాంతంలో నీటికుంట నిర్మించుకోవాలి. ఈ మేరకు ఉపాధి హామీ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే సిబ్బంది ఇచ్చే కొలతల ప్రకారం పాంఫండ్స్ తవ్వాలి. తవ్వకం పనులు ఉపాధి కూలీలే చేపడతారు. ఇందుకు రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు చదరపు మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల పొడవు, 2 లేదా 3 మీటర్ల లోతు వరకు నీటికుంటలను నిర్మించుకోవచ్చని అధికారులు తెలిపారు.
పాంపాండ్స్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
తవ్వకానికి ముందుకురాని రైతులు
అవగాహన కల్పిస్తున్న అధికారులు
అవగాహన కల్పిస్తున్నాం
రైతులు వ్యవసాయ పొలాల వద్ద పాంపాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. భూమి పోతుందని నిర్మించుకునేందుకు ముందుకు రావడంలేదు. నీటికుంటలతో లాభాలను రైతులకు వివరించి నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నాం.
– అంజిలయ్య, ఏపీఓ, దౌల్తాబాద్


