దురలవాట్లు క్యాన్సర్ కారకాలు
తాండూరు టౌన్: జీవనశైలి, దురలవాట్లు క్యాన్సర్‌కు కారకాలుగా మారుతున్నాయని క్యాన్సర్ నిపుణులు డాక్టర్ సీఎన్ శ్రీకాంత్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, యువ జాగృతి సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. శరీరంలో ఏర్పడే మార్పులను జాగ్రత్తగా గమనించాలన్నారు. పొగాకు, గుట్కా, కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. నొప్పి లేని చిన్న కణుతుల విషయంలో జాగ్రత్త పడాలన్నారు. సకాలంలో వైద్యున్ని సంప్రదించాలని, క్యాన్సర్ బారిన పడితే కీమోథెరపి, రేడియో థెరపితో పాటు పలు రకాల చికిత్సల ద్వారా క్యాన్సర్‌ను నయం చేయొచ్చన్నారు. అనంతరం ప్రజలు పలు సందేహాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు క్యాన్సర్‌పై ఎన్నో అనుమానాలున్నాయన్నారు. ఇలాంటి ప్రజోపయోగ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఐఎంఏ, యువజాగృతి సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్, యువజాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణ పేర్కొన్నారు.


