ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
దివ్యాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్
దోమ: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని దివ్యాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ కోరారు. బుధవారం మండలంలోని కొత్తపల్లిలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమకు అనేక హామీలు ఇచ్చిందని, ఏడాది పాలన పూర్తయినా అమలు చేయడం లేదని ఆరోపించారు. దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం కల్పించాలని అన్ని పార్టీలను కోరారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛను మొత్తాన్ని రూ.6 వేల పెంచాలని కోరారు. అలాగే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగుల సంక్షేమ శాఖ, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. లేని పక్షంలో సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి నుంచి నిరసన పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.


