సన్నబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు
● అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
అనంతగిరి: రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని ప్రజలు నమ్మరాదని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సూచించారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సన్న బియ్యంలో ప్లాస్టిక్ బిల్డింగ్ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. గోదావరిఖని పెద్దపల్లి జిల్లాలోని తిలక్ నగర్‌లో రేషన్ షాపులో సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ప్రచారం చేసిన వారిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసినట్లు లిపారు.
పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించండి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారంలో గల స్వామీ వివేకానంద స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బాలుర వసతి గృహం) పాఠశాలను బుధవారం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ రికార్డులను పరిశీలించారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారాని అని ఆరా తీశారు. ప్రతి నెలా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ జయసుధ తదితరులు ఉన్నారు.
రేషన్ షాపులో తనిఖీలు
పూడూరు: మండలంలోని గొంగుపల్లి రేషన్ షాప్‌ను బుధవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, డీఎస్‌ఓ మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


