నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
మర్పల్లి: పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి రైతులకు భరోస ఇచ్చారు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశం రెండెకరాల్లో బొప్పాయి, మరొ రెండెకరాల్లో అరటి పంట సాగు చేశాడు. అవీ వర్షానికి పాడయ్యాయి. విషయం తెలసుకున్న మార్కెట్ చైర్మన్ మహేందర్‌రెడ్డి స్థానిక నాయకులు, వ్యవసాయ అధికారులతో కలిసి పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించేవిధంగా కృషి చేస్తామని రైతు వెంకటేశానికి భరోస ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్, ఉద్యాన శాఖ మర్పల్లి, నవాబ్‌పేట్, మోమిన్‌పేట్ క్లస్టర్ అధికారి అర్షితరెడ్డి, సిరిపూరం రైతు వేదిక క్లస్టర్ ఏఈఓ మహేశ్, మాజీ సర్పంచ్ రాములు, కృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అంతారంలో వరిపంట పరిశీలన
తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. వడగండ్ల వానతో మండలంలోని అంతారం, బెల్కటూర్, ఎల్మకన్నె, అల్లాపూర్ గ్రామాల్లో వరిపంట పాడై పోయాయి. విషయం తెలుసుకున్న అంతారం క్లస్టర్ ఏఈఓ శివకుమార్ శనివారం అంతారం గ్రామంలోని నక్కల రాజు వరిపంటను పరిశీలించారు. దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
ధారూరులో..
ధారూరు: మండలంలోని అల్లాపూర్, నాగసమందర్ గ్రామాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి హరిప్రసాద్‌గౌడ్ శనివారం పరిశీలించారు. రైతుల పొలాలకు నేరుగా వెళ్లి ఏఏ పంట ఎంతమేరకు నష్టపోయిందో నమోదు చేసుకున్నారు. నష్టం వివరాలను జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పంపిస్తామని హరిప్రసాద్‌గౌడ్ తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ
చైర్మన్ మహేందర్ రెడ్డి


