చిన్నారికి చికిత్స
ధారూరు: పాఠశాల గది పై కప్పు నుంచి పెచ్చులూడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినికి పరీక్షలు చేయించి, మెరుగైన వైద్యం అందించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశించారు. శనివారం మున్నూరుసోమారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు రవీందర్‌కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ‘శిరీషకు మెరుగైన వైద్యం అందించాలి’ శీర్షికతో శుక్రవారం సాక్షి ప్రచురితమైన కథనాన్ని చూసిన స్పీకర్ రవీందర్‌కు ఫోన్ చేశారు. దీంతో శనివారం ఉదయాన్నే రవీందర్ తన కారులో శిరీషను వికారాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఘటన జరిగి మూడు రోజులైనా చిన్నారికి గాయాలు తగ్గలేదని, ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. డీఈఓతో పాటు విద్యాశాఖ అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్లారని, బాలికకు కనీస వైద్యం చేయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్పీకర్ చొరవపై బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు.
చిన్నారికి చికిత్స


