భారీగా జన సమీకరణ
బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు
వికారాబాద్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది.. కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కోసం 15 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మన జిల్లాలో కూడా అనేక చారిత్రక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ, విద్యార్థి జేఏసీ నాయకులు కీలకంగా వ్యవహరించారు. కెరవెళ్లి వద్ద ఆర్టీసీ బస్సును దహనం చేయడం, వికారాబాద్ సమీపంలో ప్రముఖ హీరోల షూటింగ్‌లను అడ్డుకోవడం, షూటింగ్ సెట్లను తగులబెట్టడం వంటివి జరిగాయి. పరిగిలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జిల్లా ర్యాలీలు, రాస్తారోకో, రైల్ రోకోతో దద్దరిల్లిపోయింది. నిరసన కార్యక్రమాలు, దీక్షలు ఏళ్ల పాటు సాగాయి. ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది..
20 వేల మంది తరలింపునకు ఏర్పాట్లు
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు జిల్లా నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నారు. 20 వేల మంది కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు బస్సులు, కార్లు బయలుదేరనున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి 60 బస్సులు. వంద నుంచి 150 కార్లలో కార్యకర్తలు వెళ్లనున్నారు. నియోజకవర్గానికి ఐదు వేల మంది చొప్పున తరలించాలని నిర్ణయించారు. పరిగి నియోజకవర్గ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పర్యవేక్షిస్తుండగా.. వికారాబాద్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కొడంగల్ నియోజకర్గ బాధ్యతలు పట్నం నరేందర్‌రెడ్డి తీసుకున్నారు.
ఒక్కో నియోజకవర్గం నుంచి 60 బస్సులు, వందకు పైగా కార్లు
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు


