మళ్లీ జైలుకు రావొద్దు
ఖైదీలకు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి సూచన
పరిగి: క్షనికావేశంలో చేసే తప్పులకు కుటుంబం మొత్తం క్షోభిస్తుందని జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షనికావేశంలో తప్పులు చేసి జైలుకు వచ్చి ఉంటారని.. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. జైలు నుంచి బయటికి వెళ్లిన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఆర్థిక స్తోమత లేని పేద ఖైదీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని తెలిపారు. అనంతరం పట్టణంలోని బాలసదనాన్ని సందర్శించి అనాథ పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సబ్ జడ్జి వెంకటేశ్వర్లు, పరిగి న్యాయమూర్తి నాగుల శిల్ప, జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రాము, వెంకటేష్, శ్రీనివాస్, గౌస్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


