తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్
రాజేంద్రనగర్: తెలంగాణలో త్వరలోనే గుజరాత్ తరహాలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని అందుకు అనుగుణంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన రాజేంద్రనగర్ శివరాంపల్లి ప్రజా భవన్‌లో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ... కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒకే గూటి పక్షులన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని... అలాగే బీఆర్‌ఎస్ ఓటింగ్ దూరంగా ఉంటూ మజ్లీస్‌కు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. సభలతో బీఆర్‌ఎస్ ప్రజలకు చేసేది ఏం లేదన్నారు. రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మరన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేళ్లల్లో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసి బీఆర్‌ఎస్ ప్రజలను ముంచిందన్నారు. కాంగ్రెస్‌కు నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచిందన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మరన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేసిందన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనను నిర్మించిందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 కోట్ల 30 లక్షల మంది కాశ్మీర్‌ను సందర్శించారని గుర్తు చేశారు. పహల్గాం దాడిని ప్రతి భారతీయుడు ఖండిస్తున్నారని... తగిన గుణపాఠం తప్పదన్నారు. నిరుపేద ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కొందరి చేతుల్లో వక్ఫ్ బోర్డు భూములు ఉండటంతో వాటి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారన్నారు. వక్ఫ్‌బోర్డు చట్టం ద్వారా నిరుపేద ముస్లింలందరికి లబ్ధి చేకూరడం ఖాయ మన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకం కాదని... తీవ్రవాదానికి, దేశ ద్రోహులకు వ్యతిరేకమన్నారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ముస్లిం సోదరులకు వివరించాలన్నారు.


