చతికిలపడ్డ మహిళా సంఘాలు
బొంరాస్‌పేట: ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక మండల మహిళా సమాఖ్య ఆదర్శంగా నిలిచింది. అప్పటి ముఖ్యమంత్రి సైతం మండలానికి వచ్చి ప్రశంసించారు. కానీ, ప్రస్తుతం మహిళా పరస్పర సహకార పొదుపు సమాఖ్య లిమిటెడ్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలు చతికిల పడ్డాయి. గ్రామాల్లోని చిన్న సంఘాల సమావేశాలు నిర్వహించడం లేదని సదరు సంఘాల ప్రతినిధులు, చిత్తశుద్ధి ఉన్న సీనియర్ నాయకురాళ్లు వాపోతున్నారు. తమ వేతనాలు, మొక్కుబడి ప్రగతిని చూపించుకునేందుకు అంతా ఐకేపీ సిబ్బంది, ఎంఎంఎస్ కార్యవర్గం కనుసన్నల్లోనే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కొన్ని చోట్ల తగాదాలతో స్వయం సహాయక, గ్రామ సంఘాలు మూతబడ్డాయి.
ఆశయం నిరాశ
సహకార సూత్రాలకు అనుగుణంగా పొదుపుతో స్వయం సహాయక సహకారాలను ప్రోత్సహిస్తూ సభ్య మహిళా సంఘాలను ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా ఎదిగి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఏర్పడిన సమాఖ్య ఆశయం ప్రస్తుతం నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుత సంఘాల నిర్వహణ, పర్యవేక్షణలేని దుస్థితిలో ఉండగా, కొత్త సంఘాల ఏర్పాటులో మరింత వెనకబడి ఉందని తెలుస్తోంది. గౌరారం, బురాన్‌పూర్‌లో ఉన్న మొత్తం మూడు వీఓలు మూలనపడగా పనితీరు శూన్యంగా మారిందని సభ్యులు చెబుతున్నారు.
సరిగ్గా పాతికేళ్ల క్రితం
మహిళలు సమైక్యమై స్వయంగా తమ జీవితాలు మెరుగు పర్చుకునేందుకు ఈ మండల మహిళా సమాఖ్య సరిగ్గా పాతికేళ్ల క్రితం 2000 సంవత్సరం జూన్ 28న ఏర్పాటైంది. యూఎన్‌డీపీ, సెర్ఫ్ సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహణ సాగింది. ఇప్పటికే దుప్‌చర్ల, బురాన్‌పూర్, జానకంపల్లి, మహిళా సంఘాలకు ఆర్థికంగా నిధులు, ప్రభుత్వం పాఠశాల, అంగన్‌వాడీల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టడం, వ్యవసాయ కార్యక్రమాలు, సాంకేతిక ఉపాధి శిక్షణ, వృత్తి విద్యా శిక్షణ నిర్వహిస్తున్నప్పటికీ సంఘాల నిర్వహణలో వెనుకపాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. నెలవారీ సమావేశాలు శూన్యమై ప్రభుత్వ నిధులు కార్యక్రమాలకే పరిమితం అవుతున్నాయి. సర్వసభ్య సమావేశం సోమవారం జరగనుందని మండల సమాఖ్య అధ్యక్షురాలు అనిత తెలిపారు.
నెలవారీ సమావేశాలు శూన్యం
అంతా ఐకేపీ, ఎంఎంఎస్ కార్యవర్గం కనుసన్నల్లోనే
నేడు మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం
క్లస్టర్లు: 7
సమాఖ్య పరిధిలోని జీపీలు: 47
గ్రామ సంఘాలు(వీఓలు): 45
స్వయం సహాయక సంఘాలు
(ఎస్‌హెచ్‌జీలు): 840
సభ్యులు: 9,124
దివ్యాంగుల సంఘాలు: 26
సభ్యులు: 240
సొంత భవనాల వీఓలు: 10
సీసీలు, ఏపీఎం: 5+1
చతికిలపడ్డ మహిళా సంఘాలు


