ఉపాధిలో పండ్లతోటలు!
దౌల్తాబాద్: కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు ఎన్‌ఆర్‌జీఎస్ కింద ఉద్యానవనాలు విరివిగా పెంచేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద మండలంలో పండ్ల తోటలు 80 ఎకరాల్లో పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి మండల కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వానాకాలం పంటలు ముగిిసినందున ఎవరైనా ఆసక్తి కలిగిన సన్న, చిన్న కారు రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తే వారికి అన్ని రకాల ప్రోత్సాహం అందించనున్నారు.
పరికరాలపై రాయితీ
ఉద్యానవన పంటల సాగులో మామిడి, బత్తాయి, నారింజ, జామ, సీతాఫలం, యాపిల్, బెర్రీ, కొబ్బరి, దానిమ్మ, మునగ, చింత, ఆయిల్‌పామ్ వంటివి రైతులు తమ భూముల పరిస్థితికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా ఒకే రకం సాగు చేసుకోవాల్సి ఉండగా దానికి మాత్రమే నిర్ణీత ధరలు చెల్లిస్తారు. రైతులు మొక్కలు తమకు నచ్చిన నర్సరీల్లో ఎంపిక చేసుకోవచ్చని లేని ఎడల ప్రభుత్వం ఎంపిక చేసిన నర్సరీల నుంచి తెచ్చుకోవచ్చు. రైతులు స్వయంగా కొనుగోలు చేస్తే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. పండ్ల తోటల పెంపకం వైపు వెళ్లే రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించి వారి పర్యవేక్షణలో చేపట్టాలి. ముందస్తుగా బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకుంటే 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తారు.
కావాల్సిన ధ్రువపత్రాలు
సన్న, చిన్నకారు రైతు ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగి ఉండి పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులను ఇవ్వాలి. వ్యవసాయ పొలాల వద్ద నీటి వసతి కలిగి ఉండాలి. ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే అధికారులు పరిశీలించి ఉద్యానవనాలు మంజూరు చేస్తారు. మంజూరైన రైతులకు మొక్కలకు నిధులతో పాటు గుంతలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులు ఉపాధిహామీ కిందనే చేపడుతున్నారు.
మండలంలో 80 ఎకరాల్లో
పెంపకమే లక్ష్యం
రైతులు ముందుకు రావాలని
అధికారుల సూచన
దరఖాస్తు చేసుకోవాలి
పండ్ల తోటల పెంపకానికి ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యాన పంటల సాగుతో రైతులు మెరుగైన లాభాలు పొందవచ్చు. ఈ ఏడాది 80 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి టార్గెట్ ఉంది. దీనికి అన్నదాతలు ముందుకు రావాలి.
– అంజిలయ్య, ఏపీఓ, దౌల్తాబాద్
ఉపాధిలో పండ్లతోటలు!


