తాటిముంజ.. తింటే మజా | - | Sakshi
Sakshi News home page

తాటిముంజ.. తింటే మజా

Apr 30 2025 7:12 AM | Updated on Apr 30 2025 7:12 AM

తాటిమ

తాటిముంజ.. తింటే మజా

కుల్కచర్ల: వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువ మంది చల్లదనం ఇచ్చే పండ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో తాటిముంజలు, వాటర్‌ మిలన్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. తాటికాయల్లో అధికపోషకాలు ఉండటంతో వాటిని ఇష్టపడతారు. పిల్లలు ఇష్టంగా తింటారు. ఏప్రిల్‌, మే మాసాల్లో ఇవి అధికంగా లభిస్తాయి. కుల్కచర్ల మండలం అంతారం, ఇప్పాయిపల్లి గేటు వద్ద తాటి వనాలు ఎక్కువగా ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తాటిముంజలను హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తుంటారు.

బీడు భూముల్లో..

తాటిచెట్ల పెంపకానికి పెద్దగా ఖర్చు రాదు. బీడు భూములు, పొలం గట్లపై వీటిని పెంచవవ్చు.ఇవి సుమారు 30 మీటర్ల ఎత్తు పెరు గుతాయి.తాటిచెట్ల ద్వారా తాటికల్లు, ముంజలు లభిస్తాయి. ప్రస్తుతం తాటిచెట్ల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. మొక్కలను ఉచితంగా అందజేస్తోంది.

పలువురికి ఉపాధి

తాటిచెట్ల వల్ల గ్రామీణ ప్రజలకు ఉపాధి లభిస్తోంది. తాటికల్లు, ముంజలు విక్రయించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. అంతారం గ్రామ సమీపంలో తాటి వనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ లభించే ముంజలను హోల్‌సేల్‌గా విక్రయిస్తారు. నంచర్ల, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, షాద్‌నగర్‌, మన్నెగూడ, వికారాబాద్‌, తాండూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ముంజలు కొనుగోలు చేసి వారివారి ప్రాంతాల్లో విక్రయించి ఉపాధి పొందుతున్నారు. వీరు కాకుండా ఈ మార్గంలో ప్రయాణం చేసే వారు ఎక్కువగా ముంజలను కొనుగోలు చేస్తుంటారు. కుల్కచర్ల మండలంలో సుమారు వంద కుటుంబాలు ఈ వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నాయి.

పలు ప్రయోజనాలు

● వేసవిలో తాటిముంజలు తింటే అలసట రాదు. యాక్టివ్‌గా ఉంటారు.

● సాధారణంగా గర్భిణుల్లో అజీర్ణ సమస్య ఎక్కువగా ఉంటుంది. వారు లేత ముంజలు తింటే అజీర్ణ సమస్య నుంచి బయటపడొచ్చు.

● తాటిముంజల్లో ఏ, బీ, సీ విటమిన్లు, జింక్‌, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

● వీటిలో నీటి శాతం ఎక్కువ.

● బరువు తగ్గడానికి ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఐదు పదుల వయస్సులో..

పక్క ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వార్వాల చెన్నయ్య. యాభై ఏళ్ల వయస్సులో తాటిచెట్లు ఎక్కి ముంజలు తెంపడం ద్వారా ఉపాధి పొందుతున్నాడు. నిటారుగా పెరిగే తాటిచెట్లు ఎక్కడం అంత సులువుకాదని, ప్రమాదాలు కూడా ఉంటాయని తెలిపాడు. తాను యుక్త వయస్సు నుంచే తాటిచెట్లు ఎక్కడం అలవాటని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాటికాయలు తెంపడం ద్వారా కుటుంబాన్ని పోషించుకున్నట్లు తెలిపాడు.

సీజనల్‌ పండ్లకు డిమాండ్‌ ఎక్కువ.. ముఖ్యంగా వేసవి కాలంలో తాటిముంజలు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. చల్లదనంతోపాటు ఆరోగ్యాన్ని పంచేవి కావడంతో ధర ఎక్కువైనా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తారు. తాటిముంజలకు పెట్టింది పేరు కుల్కచర్ల మండలం అంతారం గ్రామం.

నోరూరిస్తున్న సహజ ఫలం

వేసవిలో చల్లదనంతోపాటు ఆరోగ్యాన్ని పంచే తాటిముంజలు

పలువురికి ఉపాధి కల్పిస్తున్న వ్యాపారం

తాటివనాలకు కేరాఫ్‌ అంతారం

రెండు నెలలపాటు ఉపాధి

వేసవిలో రెండు నెలల పాటు తాటిముంజల వల్ల ఉపాధి లభిస్తుంది. చెట్ల నుంచి కాయలు దించి ముంజలుగా మార్చి వ్యాపారులకు విక్రయిస్తాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా వద్ద ముంజలు కొనుగోలు చేస్తారు. వేసవిలో ఈ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.

– లొడ్డ సంతోష్‌, కుల్కచర్ల

ఆరోగ్యానికి మేలు

తాటిముంజలు అన్ని వయస్సుల వారు తినొచ్చు. వేసవి కాలంలో శరీరం త్వరగా అలసిపోతుంది. తాటి ముంజలు తీసుకోవడం ద్వారా నీటిశాతన్ని పెంచుకోవచ్చు. అలసట తగ్గి ఎనర్జీ సమకూరుతుంది. జీర్ణ ప్రక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి. తాటిముంజల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. – కిరణ్‌ గౌడ్‌, మండల వైద్యాధికారి, కుల్కచర్ల

తాటిముంజ.. తింటే మజా1
1/3

తాటిముంజ.. తింటే మజా

తాటిముంజ.. తింటే మజా2
2/3

తాటిముంజ.. తింటే మజా

తాటిముంజ.. తింటే మజా3
3/3

తాటిముంజ.. తింటే మజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement