దొండపర్తి : సింహాచలం భక్తులకు శుభవార్త. కొండపైకి మరో ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రెండు ఘాట్లు అందుబాటులో ఉండగా మరో ఘాట్ రోడ్డు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు పూర్తిచేశారు.
సింహాచలం దేవస్థానం పై నుంచి కిందకు దిగేందుకు వీలుగా మరో ఘాట్ రోడ్డును నిర్మించేందుకు యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. పర్వదినాల్లో భక్తుల రాకపోకలు, వాహనాల రద్దీని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఘాట్ రోడ్డు వేసేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే తొలి పావంచ నుంచి కొండపైకి ప్రస్తుతం ఉన్న రహదారిని దశావతారం జంక్షన్ నుంచి 2.5 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఈ మేరకు వాటి సాధ్యాసాధ్యాలపై వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల సామర్థ్యం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోబోయే చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్‌అండ్‌బీ, పోలీస్, దేవస్థానం, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొని వారి సలహాలు, సూచనలు అందజేశారు. భవిష్యత్తు అవసరాలను, ప్రధానంగా గిరి ప్రదక్షిణ, చందనోత్సవం వంటి పర్వదినాల్లో భక్తులు, వాహనాల రాకపోకలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
మౌలిక వసతుల కల్పనపై దృష్టి
దేవస్థానం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాల్లో అనుకూలమైన మార్గాన్ని చూపేందుకు, అధ్యయనం చేసేందుకు దేవస్థానం, పోలీసు, ఇంజనీరింగ్, ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కూడిన కమిటీని నియమిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమిటీ అధ్యయనం తర్వాత అనుకూలమైన మార్గంలో రహదారిని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు రహదారిని ఏర్పాటు చేయటంతో పాటు సింహాచలం దేవస్థానంపై మౌలిక వసతులను కూడా కల్పించాలని చెప్పారు. 25 నుంచి 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించబోయే రహదారికి ఆనుకొని కొండపై 5 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు.
భక్తులు కొండపై బస చేసేందుకు అనువుగా అదనపు వసతి గృహాలు నిర్మించాలని, కాటేజీలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంలో దేవస్థానం అవసరాలను తీర్చేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈవోను ఆదేశించారు. సుప్రభాత సేవ, ఆరాధన సమయంలో భక్తులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అన్ని రకాల సౌకర్యాలతో కూడిన సత్రాలను నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి, ఈఈ శ్రీనివాస రాజు, డీసీపీ ఆనంద్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇలా..
దేవస్థానం నుంచి కిందకు దిగేందుకు రెండు ప్రత్యామ్నాయాలను చూపుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కొండపై ఉన్న టీవీ టవర్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డులో పాత గోశాల వైపు దిగేలా 6 కిలోమీటర్ల మేర ఒక రోడ్డును ప్రతిపాదించారు.
కొండ పై భాగంలోని ఎత్తు రోడ్డు నుంచి 4.5 కిలోమీటర్ల మేర బీఆర్‌టీఎస్ రహదారిలో దిగేలా కృష్ణాపురం గోశాల(సూర్యనారాయణ దేవాలయం) వైపు మరో రహదారిని దేవస్థానం అధికారులు సూచించారు.
తొలిపావంచ నుంచి ప్రస్తుతం ఉన్న రహదారిని దశావతారం జంక్షన్ నుంచి పైవరకు 2.5 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment