బంతిని బౌండరీకి తరలిస్తున్న గుజరాత్ జెయింట్స్ బ్యాటర్
విశాఖ స్పోర్ట్స్: కచ్చితంగా విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్ బోల్తాపడింది. పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ–20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టీ–20 లీగ్‌లో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్.
నాకౌట్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. జెయింట్స్‌కెప్టెన్ కెవిన్ టాస్ గెలిచి లక్ష్య ఛేదనకే మొగ్గుచూపడంతో సూపర్ స్టార్స్ రాస్ టేలర్ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తరంగ, జెస్సీ ఓపెనర్స్‌గా రాగా.. శ్రీశాంత్ ఇన్నింగ్స్ తొలి బంతిని విసిరాడు. జట్టు స్కోర్ 18 పరుగుల వద్ద ఈశ్వర్ చౌదరి ఓవర్‌లో జెస్సీ వికెట్ల వెనుక రావల్‌కు దొరికిపోయి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
రెండో వికెట్‌కు తరంగ– శ్రీవత్స్ 55 పరుగులు జోడించడంతో పాటు బౌండరీల మోత మోగించారు. చివరికి సదరన్ సూపర్ స్టార్స్ జట్టు ఎనిమిది వికెట్లకు 159 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. ప్రతిగా బ్యాటింగ్ ప్రారంభించిన జెయింట్స్ ఓపెనర్ ధ్రువ్ రావల్ డకౌట్‌గా తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో మరో ఓపెనర్ కెవిన్(29) వెనుదిరగ్గా అతని స్థానంలో వచ్చిన రిజర్డ్ కేవలం ఒక పరుగే చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఈ స్థితిలో వచ్చిన అభిషేక్(81) 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో అభిమానులను అలరించాడు. అతనికి చిరాగ్(21)తోడయ్యాడు. చివర్లో చిగుంబురా(21) 10 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది మరో ఎనిమిది బంతులుండగానే జట్టును విజయతీరానికి చేర్చాడు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో అభిమానులు హాజరై మ్యాచ్‌ను వీక్షించారు.
నేడు మణిపాల్ టైగర్స్‌తో అర్బన్ రైజర్స్ ఢీ
లీగ్‌లో చివరి మ్యాచ్ సోమవారం మణిపాల్ టైగర్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు మూడేసి మ్యాచ్‌ల్లో విజయంతో, ఓ పరాజయంతో ఆరేసి పాయింట్లు సాధించాయి. జెయింట్స్ ఏడు పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌కు వర్షం పడే సూచనలున్నాయి.
ఒకవేళ వర్షం పడకుండా పూర్తి మ్యాచ్ జరిగితే జెయింట్స్ ఆధిక్యాన్ని కోల్పోనుంది. కాగా.. ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించిన క్యాపిటల్స్, సూపర్‌స్టార్స్, కింగ్స్ జట్లు మూడేసి పాయింట్లతో లీగ్‌ను ముగించాయి. కాస్త మెరుగైన రన్‌రేట్‌తో క్యాపిటల్స్ జట్టు నాకవుట్‌కు చేరుకుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ–20 నాకవుట్ మ్యాచ్‌లు సూరత్‌లో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment