సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడే అమాత్య పదవిపై ఆశలు మొదలయ్యాయి. ఫలితాలు వచ్చి 24 గంటలైనా గడవక ముందే ఎవరికి వారు తమకే మంత్రి పదవి దక్కుతుందంటూ అంచనాలేసుకుంటున్నారు. వారితో పాటు వారి ప్రధాన అనుచరులు కూడా ఊహల పల్లకీలో విహరిస్తున్నారు. సీనియారిటీ, సామాజిక సమీకరణలు, కూటమి పెద్దలతో ఉన్న పరపతి, పరిచయాలు, అనుబంధాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. ఎవరికి అనుకూలంగా వారు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 13 మంది ఎమ్మెల్యేలు కూటమి తరఫున ఎన్నికయ్యారు. వీరిలో నలుగురు జనసేన, ఒకరు బీజేపీ నుంచి, మిగిలిన ఎనిమిది మంది టీడీపీ నుంచి గెలుపొందారు.
👉 విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి నాలుగోసారి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు ఈ దఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయనకు బాలకృష్ణతో పాటు ఆయన అల్లుడు, విశాఖ ఎంపీగా ఎన్నికై న శ్రీభరత్‌తో సత్సంబంధాలున్నాయి. ఇవన్నీ తమ నాయకుడు వెలగపూడికి మంత్రి పదవి దక్కేందుకు కలిసొచ్చే అంశాలని ఆయన అనుచరులు చెబుతున్నారు.
👉 నాలుగోసారి గెలిచిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా మంత్రి పదవిపై నమ్మకంతో ఉన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మంత్రిగా పనిచేశారు. తన సామాజికవర్గం కోటా కలిసొస్తుందని ఆయన ఆశతో ఉన్నారు.
👉 పెందుర్తి నుంచి జనసేన తరఫున ఎన్నికై న పంచకర్ల రమేష్‌బాబుకి ఇది మూడోసారి గెలుపు. దీంతో తన సీనియారిటీ, జనసేన కోటా, సామాజికవర్గం కలిసొచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు. అయితే గంటా, పంచకర్లది ఒకే సామాజికవర్గం కావడంతో ఈయనకు మంత్రి పదవి ప్రతిబంధకంగా మారుతుందని అంటున్నారు.
👉 నర్సీపట్నం నుంచి ఏడోసారి గెలుపొందిన అయ్యన్న తనకు మంత్రి పదవి ఖాయమన్న భావనలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కేబినెట్‌లో స్థానం దక్కడంతో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
👉 గాజువాక నుంచి టీడీపీ తరఫున రెండోసారి గెలిచిన పల్లా శ్రీనివాసరావు తన సామాజికవర్గ కోటాలో మంత్రివర్గంలో స్థానం ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఆయన అనుచరులు ఇప్పటికే ఈ ప్రచారం మొదలు పెట్టారు.
👉 విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికై న విష్ణుకుమార్‌రాజు తనకు కూటమి బీజేపీ కోటాలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశతో ఉన్నారు. అయితే బీజేపీ నుంచి గెలిచిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు ఆయనకు పోటీగా ఉన్నారు.
👉 పాయకరావుపేట నుంచి రెండో దఫా ఎన్నికై న వంగలపూడి అనిత కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజికవర్గం, మహిళా కోటా తనకు కలిసొస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.
👉 జనసేన తరఫున అనకాపల్లి నుంచి గెలిచిన కొణతాల రామకృష్ణ 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. జనసేనలో సీనియర్ అయిన కొణతాల తనకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమని భావిస్తున్నారు.
👉 ఆఖరి నిమిషంలో మాడుగుల సీటు దక్కించుకుని పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అయ్యన్నది, ఈయనది ఒకే సామాజికవర్గం కావడం అడ్డంకిగా మారుతుందని చెబుతున్నారు. ఇలా ఫలితాలు వెలువడ్డాయో లేదో అలా మంత్రి పదవులపై ఎవరికి వారే అంచనాల్లో మునిగి తేలుతున్నారు. వారి అనుచరులు సైతం బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment