
ఊహకందని కథతో ‘తల’
బీచ్‌రోడ్డు: ప్రేక్షకులు ఊహలకు అందని ఎన్నో మలుపులతో ‘తల’ సినిమా ఉంటుందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ అన్నారు. తల చిత్ర ప్రమోషన్‌లో భాగంగా గురువారం నగరంలో హీరో, దర్శకుడు, సినిమా బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా సిరిపురంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడారు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా తల సినిమా విడుదలవుతుందని, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ప్రస్తుతం టీనేజ్ ప్రేక్షకులే అధికంగా సినిమా థియేటర్లకు వస్తున్నారన్నారు. అమ్మ రాజశేఖర్ కుమారుడు, హీరో రాగిని రాజ్ మాట్లాడుతూ చాలా మంది నటులు ప్రేమ కథలతోనే పరిచయమవుతారని, తాను ఓ మంచి కంటెంట్ ఉన్న కథతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్నారు. హాస్య నటుడు అవినాష్ మాట్లాడుతూ బిగ్‌బాస్ షోలో ఇచ్చిన మాట ప్రకారం అమ్మ రాజశేఖర్ ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రేమికుల దినోత్సవం రోజున వైలెంట్ వాలెంటైన్‌గా హీరో అందరికీ నచ్చుతాడన్నారు.