
ఇలాగేనా.. గ్రాండ్ టెస్ట్
● పరీక్షకు డుమ్మా కొడుతున్న విద్యార్థులు ● బీఈడీ విద్యార్థులతో పరీక్షలపై పర్యవేక్షణ
విశాఖ విద్య: విద్యాశాఖ ఆదేశాల మేరకు టెన్త్ విద్యార్థుల్ని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రాండ్ టెస్ట్‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు వార్షిక పరీక్షల మాదిరే పకడ్బందీగా వీటిని నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారు. అయితే గ్రాండ్ టెస్ట్‌లకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ హైస్కూల్(ఎయిడెడ్)లో టెన్త్ విద్యార్థులు 82 మందికి గాను 64 మంది గ్రాండ్ టెస్ట్ రాశారు. విద్యార్థులు ఇళ్ల వద్ద, మరికొంతమంది కోచింగ్‌లకు వెళ్తున్నందున గ్రాండ్ టెస్ట్‌కు గైర్హాజరైనట్లు పాఠశాల హెచ్‌ఎం సలోమి తెలిపారు. ఇక్కడి పరీక్షను బీఈడీ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో పర్యవేక్షణ చేయించారు. మూడు గదుల్లో పరీక్షలు నిర్వహించగా, అన్ని చోట్ల బీఈడీ చేస్తున్న విద్యార్థులే ఇద్దరు ముగ్గురు చొప్పున పర్యవేక్షిస్తూ కనిపించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహణ తీరుపై సందేహాలు ముసురుకున్నాయి.
హాజరు అంతంత మాత్రమే..
సమ్మెటివ్–1, సమ్మెటివ్–2 పరీక్షల ప్రాతిపదికగా, విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి, వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వీటికి తోడు అట్టహాసంగా గ్రాండ్ టెస్ట్‌లకు సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు గ్రాండ్ టెస్ట్‌లపై ఆసక్తి చూపటం లేదనేది ఏయూ హైస్కూల్ హాజరు తీరునుబట్టి తెలుస్తోంది. ఒక్క స్కూల్లోనే 18 మంది వరకు విద్యార్థులు గైర్హాజరైతే.. జిల్లా వ్యాప్తంగా ఇంకెంత మంది డుమ్మా కొడుతున్నారో..? తేలాల్సి ఉంది. గ్రాండ్ టెస్ట్‌ల నిర్వహణపై అధికారులకు, ఉపాధ్యాయులకు కూడా పెద్దగా ఆసక్తి లేదన్నది స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment