ముచ్చలయను అభినందిస్తున్న కోలగట్ల శ్రావణి, ఇతర కార్పొరేటర్లు
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్–1గా వైఎస్సార్ సీపీకి చెందిన 1వ డివిజన్ కార్పొరేటర్ ముచ్చు లయయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేసీ మయూర్ అశోక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ పీవీడీ ప్రసాదరావు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్‌గా వ్యవహరించిన ఇసరపు రేవతీదేవి రాజీనామా చేయడంతో ఎన్నిక ప్రక్రియ నిర్వహించినట్టు తెలిపారు. ముచ్చు లయయాదవ్ పేరును 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ప్రతిపాదించగా 40వ డివిజన్‌కు చెందిన బోనెల ధనలక్ష్మి బలపరిచారు. ఒక్కరి పేరునే ప్రతిపాదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు జేసీ ప్రకటించారు. ఎన్నిక పత్రాన్ని అందజేశారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ 16 నిమిషాల్లోనే ముగిసింది. ఎన్నిక ప్రక్రియలో 50 మంది కార్పొరేటర్లకు 44 మంది హాజరయ్యారు.
అభినందనల వెల్లువ
డిప్యూటీ మేయర్–1గా ఎన్నికై న లయయాదవ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఫ్లోర్ లీడర్ ఎస్‌వీవీ రాజు, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణుతో పాటు తోటి కార్పొరేటర్లు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలో డిప్యూటీ మేయర్–1గా ముచ్చు నాగలక్ష్మి ఎన్నికయ్యారని, ఆమె మరణంతో అదే సామాజిక వర్గానికి చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ఎన్నికయ్యారన్నారు. ఆమె వ్యక్తిగత కారణాలవల్ల పదవికి రాజీనామా చేయడంతో లయ యాదవ్‌ను ఎన్నుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆశీస్సులతో నూతన బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని లయ యాదవ్ పేర్కొన్నారు. నగర అభివృద్ధికి తన వంతు సహకరిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment