ప్రైవేటు లాడ్జిలో రూమ్‌కు మకాం షిఫ్ట్
అలా వచ్చి ఇలా వెళ్తున్న వైనం
ముందే చెప్పిన వైఎస్సార్‌సీపీ నాయకులు
చీపురుపల్లి: జాతర జరిగే చోటకు సర్కస్ కంపెనీలు రావడం.. జాతర ముగిశాక తట్టాబుట్టా సర్దేయడం మనందరికీ తెలిసిందే. చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక్కడ అభ్యర్థులు మారిపోతుండడం, వారు కూడా ఇతర జిల్లాల నుంచి వలస రావడం, పోలింగ్ ముగిసిన మరుచటి రోజు నుంచే కనిపించకపోవడం సర్వసాధారణమైపోయింది.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడ అదే సీన్ రిపీట్ అయ్యింది. మే 13న పోలింగ్ ముగిసిన తరువాత చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆఫీస్‌ను ఖాళీ చేసేశారు. మూటాముడి సర్దేశారు. కళా కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందంటూ ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్ ముగిసాక చీపురుపల్లి నియోకజవర్గ టీడీపీలో ఇదే పరిస్థితి ఉంటుందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ కోఆర్డినేటర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో ప్రతీ గ్రామంలోనూ ప్రజల కు వివరించారు. తాజాగా అదే జరగడంతో నియోజకవర్గంలో అంతేగా.. అంతేగా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఆఫీస్ ఖాళీ చేసిన కళా..
చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళా వెంకటరావు పేరును మార్చినెలాఖరులో టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆయన ఏప్రిల్ మొదటి వారంలో చీపురుపల్లిలో తొలిసారి అడుగు పెట్టారు. ఓ వారం వరకు టీడీపీ సీనియర్ నేతకు చెందిన ఓ లాడ్జిలోనే మకాంవేశారు. తరువాత కనీసం అద్దె ఇల్లు కూడా తీసుకోకుండా గరివిడి నుంచి విజయనగరం వెళ్లే ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న ఓ కల్యాణమండపాన్ని మే 13 వరకు అద్దెకు తీసుకున్నారు. అక్కడే కళా బస ఏర్పాటు చేసి, కార్యకర్తలకు భోజనాలు కోసం వంటలు వండించారు. మే 13న పోలింగ్ పూర్తయిన తరువాత 14న మరోసారి కార్యకర్తల కోసం చివరి సారిగా భోజనాలు వండి పెట్టారు. అంతే.. అదే ఆఖరి రోజు. కల్యాణ మండపం అద్దె సెటిల్ చేసి ఖాళీ చేసేశారు. ఆ తరువాత ఈ నెల 18న ఓ లాడ్జిలో ప్రెస్‌మీట్ పెట్టారు. తరువాత ఆయన అక్కడా కనిపించకపోవడంతో.. ఏదైనా అవసరం వస్తే ఎక్కడ, ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి దాపురించిందని పార్టీ శ్రేణ్రుల్లో అంతర్మథనం ప్రారంభమయ్యింది.
కళాకు ఇది అలవాటే..
టీడీపీ అభ్యర్థి కళా తన ఆనవాయితీను కొనసాగించారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా కనీసం అద్దె ఇల్లు కూడా లేకుండా కాలయాపన చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఎచ్చెర్ల నియోజకవర్గంలో పదేళ్ల పాటు బాధ్యతలు వహించినా అదే ఆనవాయితీ కొనసాగించగా, చీపురుపల్లిలో కూడా అదే విధానం ఇక్కడ క్యాడర్‌కు అలవాటు చేయాలన్నదే ఆయన ఆలోచన అంటూ సొంత పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఎలాగూ విజయావకాశాలు తక్కువగా ఉన్నాయనే అంచనాకు వచ్చిన నేపథ్యంలో కనీసం అద్దె ఇల్లు కూడా తీసుకోలేదనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment