మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ టీమ్స్
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని విద్యా సంస్థల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈగల్ టీమ్స్‌ను ఏర్పాటుచేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు, ఇంజినీరింగ్, మెడికల్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల ల్లో ‘సంకల్పం’ కింద డ్రగ్స్ వినియోగం, వాటివల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రచారం చేయాలన్నారు. ప్రతిరోజూ ప్రార్థన నిర్వహించే సమయంలో ఉపాధ్యాయులు 10 నిమిషాలపాటు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించాలన్నారు. డీ అడిక్షన్ సెంటర్ పనిచేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి అందజేయాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, డ్రగ్స్ విభాగం సంయుక్తంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గంజాయిసాగు లేదన్నారు. ఏఎస్‌ఆర్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా జరుగుతుందన్నారు. దీనిని కట్టడిచేసేందుకు ఐదు పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టిన నిందితుడికి చెందిన రూ.1.96 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో లక్షా 18 వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతిని ఎస్పీ వకుల్‌జిందల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఆర్టీఓ శ్రీనివాసరావు, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్సీ జి.భవ్యారెడ్డి, ఆర్డీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment