విజయనగరం లీగల్: ప్రస్తుత రోజుల్లో బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని వారి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముందుగా తల్లిదండ్రులు, క్లాస్ టీచర్లకు తెలియజేయాలని జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. పోక్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ 2012లో ఏర్పడిన పోక్సో చట్టం గురించి వివరించారు. బాలబాలికలకు న్యాయవ్యవస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. బాలల హక్కులను కాపాడడానికి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. బాలబాలికలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి పట్ల కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. 18 సంవత్సరాల్లోపు విద్యార్థులకు బాల్య దశనుంచే రాజ్యాంగం పట్ల సామాన్యమైన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో మెలగాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి బి.అప్పలస్వామి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్, మండల విద్యాశాఖాధికారి పి.సత్యవతి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పర్వీన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోక్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన