విజయనగరం ఫోర్ట్: మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాలల సంక్షేమం, పరిరక్షణ కోసం గ్రామస్థాయిలో సర్పంచ్ ఽ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామస్థాయి కమిటీలో మహిళా పోలీస్ కన్వీనర్‌గా ఉంటారని, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయలు, ఎన్‌జీఓలు, ఆరోగ్యవర్కర్స్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామస్థాయి సమావేశాల్లో అనాథ పిల్లల్ని, స్కూల్ డ్రాపౌట్స్‌ను గుర్తించాలని చెప్పారు. బాల్య వివాహాలు, ట్రాఫికింగ్, డ్రగ్స్ దోపిడీ తదితర అంశాలపై చర్చించాలని సూచించారు. బాలల హక్కుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి కమిటీలో చర్చించిన అంశాలను జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో టీనేజీ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలపై చర్చ జరగాలని, బాల్యవివాహాలు చేయాలనే అలోచనే తల్లిదండ్రులకు రాకుండా చేయాలన్నారు. బాల్య వివాహ చట్టంపై అవగాహన కల్పించి చట్టంలో ఉన్న శిక్షలపై కూడా తెలిసేలా చూడాలని చెప్పారు. హోటల్స్, కర్మాగారాల్లో పనిచేసే బాలలను గుర్తించాలని కోరారు. సమావేశంలో ఇన్‌చార్జి ఐసీడీఎస్ పీడీ ప్రసన్న, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్