
ఆదుకోకోంటే ఉద్యమమే
పెదవేగి: కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
కంపెనీల సిండికేట్‌తో దోపిడీ
కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కోకో రైతులు సంఘటితం కావాలి
కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్ అయి ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు.
24న ధర్నాలు, రాస్తారోకోలు
కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గొడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది.
తేల్చిచెప్పిన కోకో రైతులు
కొనుగోలు సమస్యలను ప్రభుత్వం
పరిష్కరించాలని డిమాండ్
విజయరాయిలో రాష్ట్ర సదస్సుకు
పెద్దసంఖ్యలో రైతుల హాజరు

ఆదుకోకోంటే ఉద్యమమే