విజయనగరం అర్బన్: జిల్లా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించాలంటే తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులు పూర్తికావాలి... దీనికి అవసరమైన నిధులు మంజూ రు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తి చేసేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో జలవనరుల శాఖ అధికారులు నివేదిక అందజేయాలని ఆదేశించారు. తన కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ సాగరం ప్రాజెక్టులను పూర్తిచేస్తే సుమారు 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని, ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా జరిగే అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తామని చెప్పారు. కలెక్టర్ల సదస్సు మార్చి 25, 26 తేదీల్లో అమరావతిలో జరగనుందని, జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివిధ శాఖల అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే అద నంగా ఎంతమేరకు లక్ష్యాలు సాధించగలమో పేర్కొంటూ వాస్తవిక అంచనాలను మాత్రమే ఇవ్వా లని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.