గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు స్థానిక ఎస్సై పి.రమేష్ నాయుడు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నాల్గవ గేటు వద్ద యువకుడి మృతదేహం తేలియాడుతూ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత మృతుడిని పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆలవెల్లి రాజా(26)గా గుర్తించారు. ఈనెల 19 బుధవారం ఉదయం నుంచి కుమారుడు ఆలవెల్లి రాజా ఆచూకీ లేకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా శుక్రవారం తోటపల్లి జలాశయం వద్ద రాజా మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.