ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి సాగుచేసిన మొక్కజొన్న పంట చేతికందిన సమయంలో ధర పడిపోవడం రైతు కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో సుమారు 17 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగుచేశారు. హెక్టారుకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చుకాగా, 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మొక్కజొన్నను ఎక్కువగా కోళ్ల మేతకు వినియోగిస్తారు. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడం, కోళ్లు లక్షల్లో చనిపోవడంతో కొత్తగా కోడి పిల్లల పెంపకాన్ని పౌల్ట్రీ యజమానులు నిలిపివేశారు. ఈ ప్రభావం మొక్కజొన్నపై పడింది. అధిక దిగుబడి వచ్చినా క్వింటా ధర కేవలం రూ.2,200 పలుకుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రైతుకు మద్ధతు ధర చెల్లించి పంట కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై జిల్లా వ్యవసాయాధికారి రామారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వారం రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. – రామభద్రపురం