
అవినీతికి కేరాఫ్ ఉపాధి
విజయనగరం ఫోర్ట్:
గ్రామీణ ప్రాంత ప్రజల వలసలను నివారించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొంతమంది సిబ్బందికి వరంలా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకంలో పని చేసే క్షేత్ర సహాయకుల నుంచి ఏపీఓల వరకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలున్నాయి. వీరిలో కొంత మంది పట్టుబడుతుండగా మరి కొంతమంది తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహించే సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) బృందం సభ్యులు నిర్వహించే తనిఖీల్లో సిబ్బంది అక్రమాలను గుర్తించి ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తుండడంతో అక్రమాలకు పాల్పడ్డ వారి గుట్టు రట్టువుతుంది. అక్రమాలకు పాల్పడినప్పటకీ కొంతమంది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023 – 24 ఏడాదిలో వేతనదారులు ఎంత పని చేశారు.. చేసిన పనికి తగ్గ వేతనాలు వారికి పూర్తి స్థాయిలో అందాయా.. లేదా, ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి ఉపాఽధి హామీ పథకం ద్వారా రావాల్పిన బిల్లులు వచ్చాయా.. రాలేదా, పని కల్పించడానికి సిబ్బంది ఏమైనా అవినీతికి పాల్పడ్డారా.. అన్న అంశాలపై గ్రామాల్లో సామాజిక తనిఖీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గుర్తించిన అక్రమాలు వివరాలు, అక్రమాలకు పాల్పడ్డ సిబ్బంది పేరు రాసి నివేదిక అందజేస్తారు. ఈ వేదికల్లో ఎవరి నుంచి ఎంత రికవరీ చేయాలన్నది కూడా వెల్లడిస్తారు.
612 మంది నుంచి రికవరీకి ఆదేశాలు
2023 – 24 సంవత్సరానికి సంబంఽధించి సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) సిబ్బంది నిర్వహించిన సామాజిక తనిఖీలో 612 మంది అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. వారి నుంచి రికవరీ చేయాలని గుర్తించి ఉపాధి హామీ ఉన్నత అధికారులకు నివేదిక అందజేశారు. ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్స్), మేట్‌లు, సాంకేతిక సహాయకులు (టెక్నికల్ అసిస్టెంట్స్) ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (ఈసీ), కంప్యూటర్ ఆపరేటర్స్, ఏపీఓలు క్షేత్ర స్థాయిలో పని చేస్తుంటారు. సోషల్ ఆడిట్ సిబ్బంది రికవరీకి సూచించింది కూడా ఈ కేడర్ల వారిపైనే.
రూ.7.35 లక్షలు రికవరీ
ఉపాధి హామీ సిబ్బంది నుంచి రూ.7.35 లక్షలు రికవరీ చేయాలని సామాజిక తనిఖీ సిబ్బంది సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ సిబ్బంది 463 మంది, టెక్నికల్ అసిస్టెంట్స్ 86 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 28 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ 23 మంది, ఏపీఓలు 12 మంది నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయనున్నారు.
సిబ్బంది పాల్పడే అవతవకలు ఇవే..
●బినామీ మస్తర్లు వేసి వారి ద్వారా డబ్బులు తీసుకోవడం.
●తక్కువ కొలతలో పని చేసినప్పటికీ ఎక్కువగా పని చేసినట్టు కొలతలు వేయడం.
●మొక్కలు చనిపోయినప్పటకీ, బ్రతికి ఉన్నట్టు చూపించి వాటికి సంబంధించి మెయింటెనెన్స్ తీసు కోవడం తదితర అక్రమాలకు పాల్పడతారు. అయితే అక్రమాలకు పాల్పడ్డ సిబ్బంది నుంచి రికవరీతోనే సరిపెట్టేస్తుండడంతో అక్రమాలకు చెక్ పడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 6 లక్షల మంది వేతనదారులు
ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో 3.85 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో యాక్టి వ్ జాబ్ కార్డులు 3.41 లక్షలు ఉన్నాయి. అదే విధంగా 6.04 లక్షల మంది వేతనదారులు ఉపాధి హామీ పథకంలో పనులకు వస్తున్నారు.
ఉపాధి హామీ పనుల్లో పెచ్చుమీరుతున్న అవినీతి
సామాజిక తనిఖీల్లో వెల్లడవుతున్న నిజాలు
612 మంది నుంచి రూ.7.35 లక్షల రికవరీకి ఆదేశాలు
బినామీ మస్తర్లు, కొలతల్లో అక్రమాలు
రికవరీ ప్రారంభించాం
రూ.7.35 లక్షలు రికవరీ చేయాలని సోషల్ ఆడి ట్ సిబ్బంది సూచించారు. రూ.1.59 లక్షలు సిబ్బంది జీతాల నుంచి రికవరీ ప్రారంభించాం. మిగతా డబ్బులు కూడా శతశాతం రికవరీ చేస్తాం. – ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా

అవినీతికి కేరాఫ్ ఉపాధి