
దేవుడా.. మాకు దిక్కెవరు..
● పశ్చిమబెంగాల్‌లో జీఆర్‌ఈఎఫ్ జవాన్ మృతి ● వీరభద్రపురానికి మృతదేహం తరలింపు ● అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
కొత్తవలస:
బాగున్నావా.. పిల్లలు ఏం చేస్తున్నారు.. చక్కగా చదువుతున్నారా.. ఆరోగ్యం జాగ్రత్త.. అమ్మనాన్నలు బాగున్నారా.. అంటూ ఫోన్‌లో కుటుంబ క్షేమ వివరాలు తెలుసుకున్న భర్త.. విగతజీవిగా కళ్లముందు కనిపించేసరికి భార్య కన్నీటిశోకంలో మునిగిపోయింది. దేవుడా.. ఎంత పనిచేశావంటూ భర్త మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించింది. పారామిలటరీ జవాన్ మృతితో కొత్తవలస మండంలోని వీరభద్రపురం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశ సాయుధ దళాల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ)లో పారా మిలటరీకి చెందిన జీఆర్‌ఈఎఫ్ (జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్) విభాగంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పనిచేస్తున్న వీరభద్రపురం గ్రామానికి చెందిన రాయపురెడ్డి దేముడునాయుడు విధుల్లో ఉంటూ శనివారం వాంతులతో అస్వస్థతకు గురై అక్కడి మిలటరీ ఆస్పత్రిలో మృతిచెందారు. జవాన్ మృతి చెందిన విషయాన్ని ఆర్సీ–87 (జీఆర్‌ఈఎఫ్) మేజర్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్‌కుమార్ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్‌జిందల్, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని వీరభద్రపురానికి సోమవా రం తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసి భార్య నాగమణితోపాటు కుమారులు హర్షవర్దన్(9), యశ్వంత్(7), తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతదేహానికి మాజీ సైనిక ఉద్యోగులతో పాటు కొత్తవలస సీఐ షణ్ముఖరావు పూలమాలలు వేసి గౌరవవందనం సమర్పించారు. విజయనగరం నుంచి వచ్చిన ప్రత్యేక రిజర్వ్‌డ్ పోలీసులు గౌరవవందనం సమర్పించి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

దేవుడా.. మాకు దిక్కెవరు..