భక్తిభావంతో మెలగాలి
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి
ఖిల్లాఘనపురం: గిరిజన తండాల్లోని మహిళలు, విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కర్నెతండాలో జరిగిన తుల్జాభవాని ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలన్నారు. గిరిజనులు విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్యానాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, రాష్ట్ర లంబాడి హక్కుల సమితి పోరాట సమితి అధ్యక్షుడు రాంబల్‌నాయక్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సామ్యానాయక్, వివిధ గ్రామాల నాయకులు రంగారెడ్డి, మన్యంగౌడ్, దేవిజానాయక్, పీన్యానాయక్, పీల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
కృత్రిమ కొరత
సృష్టిస్తే చర్యలు
అమరచింత: ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏడీఏ దామోదర్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆగ్రో ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలో ఎరువుల నిల్వలను పరిశీలించి మాట్లాడారు. కొత్తకోట డివిజన్ పరిధిలో 84 దుకాణాలున్నాయని.. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అక్రమంగా నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వరి పంటకు ఆకు ఎండు, పొట్టకుళ్లు తెగులు, సుడిదోమ వ్యాపిస్తోందని నివారణకు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల మందులు, రసాయనాలను అందుబాటులో ఉంచాలని దుకాణ నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఏఓ అరవింద్ తదితరులు ఉన్నారు.
14న క్రికెట్ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: వచ్చే నెల 2 నుంచి వరంగల్, సంగారెడ్డి పట్టణాల్లో జరగనున్న హెచ్‌సీఏ అండర్–23 టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఈనెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు జట్లను ఎంపిక చేసి, ఆయా జట్లకు మ్యాచ్‌లు నిర్వహించి ప్రతిభకనబరిచిన వారితో తుది జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌కార్డు, వైట్ డ్రెస్, వైట్ షూస్‌తో హాజరుకావాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment