పాలమూరుపై పగ ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

పాలమూరుపై పగ ఎందుకు?

Published Sat, Feb 22 2025 12:49 AM | Last Updated on Sat, Feb 22 2025 12:49 AM

పాలమూ

పాలమూరుపై పగ ఎందుకు?

నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల హయాంలో పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్‌, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్‌కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

70 ఏళ్లకు సీఎం పదవి

హైదరాబాద్‌ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్‌ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్‌, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘పేట–కొడంగల్‌’ను పూర్తి చేసుకుందాం

పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్‌, కొడంగల్‌, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్‌ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్‌, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలోనే తొలి మహిళా పెట్రోల్‌ బంక్‌

ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంభన ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ మంజూరు చేశామని సీఎం అన్నారు. నాడు కాంగ్రెస్‌ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరిట మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకొని.. ఈ రోజు నారాయణపేట మండలం అప్పక్‌పల్లి నుంచి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు

కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా.. సాగు, తాగునీరు లేదు

ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం

నారాయణపేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

No comments yet. Be the first to comment!
Add a comment
పాలమూరుపై పగ ఎందుకు?1
1/1

పాలమూరుపై పగ ఎందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement