
పరమేశ్వరస్వామి చెరువును పరిశీలించిన అధికారులు
ఆత్మకూర్: పట్టణంలోని పరమేశ్వరస్వామి చెరువును శనివారం పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్ జుంకీలాల్, బోట్ ఆపరేటర్ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి స్వల్ప రుసుంతో చెరువులో బోట్ నడుపుతామని, జాతర తర్వాత పరిస్థితులను బట్టి కొనసాగించా లేదా అన్న విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాలు, బారికేడ్లు, ప్లాట్‌ఫాం ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించామని వివరించారు.
ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
వనపర్తి రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలంటూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి సురేశ్ ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులు భోజన విరామ సమయంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో మహిళా సిబ్బందికి రక్షణ లేదని, ఫిర్యాదు చేసిన మహిళా కార్మికులను ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉండి మహిళలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని తెలిపారు. ఆమె అనధికారికంగా ఐదుగురు కార్మికులను మహబూబ్‌నగర్‌లోని సొంత ఇంటికి తీసుకెళ్లి పని చేయించుకొని మూడు నెలలు గడిచిన తర్వాత వారిపై దొంగతనం అభియోగం మోపడం బాధాకరమన్నారు. సమగ్ర విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలని.. లేనిచో దశల వారీగా ఉద్యమాలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు మద్దిలేటి, వరుణ్, షకీల్, రాజశేఖర్, మణెమ్మ, చెన్నమ్మ, సైదమ్మ, లావణ్య, నారమ్మ, రమ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాలను
పరిరక్షించాలి : సీపీఐ
ఆత్మకూర్: పట్టణంలో అక్రమ కట్టడాలు తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు కోరారు. శనివారం పుర కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాబాకాలనీలో రహదారిని సైతం అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీపీ రహదారిని కబ్జా చేసి దుకాణాలు నిర్మిస్తున్నారని.. పనులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్రజా అవసరాలు, పార్కులు తదితరాల కోసం కేటాయించిన 10 శాతం స్థలాన్ని సైతం అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆరోపించారు. కబ్జాకోరుల చెర నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సీఎన్ శెట్టి, మోషా, అబ్రహం, భాస్కర్, కుతుబ్, రవీందర్, శేఖర్, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఏలినాటి శని నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోపాలరావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, కమిటీ సభ్యులు ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్ పాల్గొన్నారు.

పరమేశ్వరస్వామి చెరువును పరిశీలించిన అధికారులు

పరమేశ్వరస్వామి చెరువును పరిశీలించిన అధికారులు

పరమేశ్వరస్వామి చెరువును పరిశీలించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment