
భగ్గుమన్న విభేదాలు
వనపర్తి: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వనపర్తి జిల్లాలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎదుటే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా.. జిల్లాలోని గోపాల్‌పేట మండలంలోని బుద్దారం గండి వద్ద నూతన మార్కెట్ యార్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వచ్చారు. అయితే ఈ యార్డును అందరికీ ఆమోదయోగ్యంగా గోపాల్‌పేటలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తన వర్గీయులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే మేఘారెడ్డి కల్పించుకొని బుద్దారంలోనే మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మంత్రి ముందే తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు మంజూరైన మరో మార్కెట్ యార్డు విషయంలోనూ మండల నాయకుల్లో రసాభాసకు దారితీసింది. ఈ విషయమై ఆయా ప్రాంతాల కాంగ్రెస్ నాయకుల్లో విభేదాలు బయటపడటంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పర్యటనను ఖిల్లాఘనపురంలోనే రద్దు చేయాల్సి వచ్చింది.
మంత్రి తుమ్మల ఎదుటే వాగ్వాదానికి దిగిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment