హక్కులపై అవగాహన ఉండాలి
వనపర్తి: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్‌లోని పౌరసరఫరాలశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వినియోగదారులు ఎక్కడైనా, ఏవైనా వస్తువులు కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలు, గడువు ముగింపు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నేటి కాలంలో ఆన్‌లైన్ వేదికగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఏదైనా కొనుగోలు చేసి మోసపోతే ఆన్‌లైన్ ద్వారానే వినియోగదారుల ఫోరంను సంప్రదించవచ్చన్నారు. డిజిటల్ విధానంలో ఫిర్యాదు చేయడంతో పాటు వర్చువల్ హియరింగ్‌తో సకాలంలో సత్వర న్యాయం పొందవచ్చని.. ఈ సేవలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీటీలు, ఇతర అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.


