యాసంగి వరిధాన్యం సేకరణకు ప్రణాళికలు
అమరచింత: యాసంగి సీజనల్‌లో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందించింది. వచ్చేనెల రెండో వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో.. మొదటి వారంలోనే ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండలాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరి కోతలకు ముందుగానే గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడంతో పాటు సన్నరకాలకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులను సైతం పూర్తిస్థాయిలో చెల్లించిన అధికారులు.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో వరిసాగు ఇలా..
జిల్లాలోని 255 గ్రామాల్లో రైతులు ఈసారి సన్నరకాలను సాగుచేస్తున్నారు. మొత్తం 1.95 లక్షల ఎకరాల్లో వరిపంట సాగుచేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారుల సమాచారం. అయితే జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా ఈసారి అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల్లో కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారు. మిగిలిన ఆయకట్టు రైతులు సమీపంలోని చెరువులు, బోరుబావులపై ఆధారపడి వరిసాగు చేపట్టారు. వేసవికాలం ప్రారంభం తర్వాత భూగర్భజలమట్టం పడిపోవడంతో బోరుబావుల నుంచి నీరందని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడక్కడ వరిపంట ఎండిపోయింది. మరికొన్ని చోట్ల ఎండుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడిని పొందలేని పరిస్థితులు ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే ఈసారి 3.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉండేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో వరిసాగు:
1.95లక్షల ఎకరాలు
ధాన్యం దిగుబడి అంచనా :
3.95లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు లక్ష్యం :
3.50లక్షల మెట్రిక్ టన్నులు
15 రోజుల్లో కోతలు..
యాసంగిలో సాగుచేసిన వరిపంట ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. అక్కడక్కడ 15 రోజుల వ్యవధిలో కోతలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వడగండ్ల వానలు పడితే వరిపైరు దెబ్బతినే అవకాశం ఉంది. అదే విధంగా ఈదురు గాలులు వీచితే పంట నేలకొరిగి కోతల సమయంలో గింజలు కిందపడే అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల మేరకు రైతులు వరికోతలు చేపట్టాలి.
– దామోదర్, ఏడీఏ
ఏర్పాట్లు చేస్తున్నాం..
కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వరికోతలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయో గమనించి, రైతుల అవసరాల మేరకు వచ్చేనెల 1నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈసారి మొత్తం 414 కేంద్రాలను ఏర్పాటుచేసి.. 3.50 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
– జగన్మోహన్, డీఎం, సివిల్ సప్లై
జిల్లాలో 414 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు
ఏప్రిల్ రెండో వారంలో వరికోతలు ప్రారంభమయ్యే
అవకాశం
రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు
దళారుల బేరసారాలు..
వరిపైరు పొట్టదశకు చేరుకున్న సమయంలోనే కొందరు దళారులు రైతుల పొలాలకు వెళ్లి నేరుగా ధాన్యాన్ని కొంటామని.. రవాణా ఖర్చులు లేకుండా తామే తీసుకెళ్తామంటూ బేరసారాలు మొదలుపెట్టారు. పచ్చి వడ్లను సైతం ప్రభుత్వ ధరకు అనుగుణంగా కొంటామని.. తమకే అమ్మాలని రైతుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
కొనుగోళ్లకు సన్నద్ధం
కొనుగోళ్లకు సన్నద్ధం
కొనుగోళ్లకు సన్నద్ధం


