వనపర్తి: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని.. ఆ దిశగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీపై సోమవారం కలెక్టరేట్‌లో రేషన్ డీలర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం పంపించే సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం పంపిణీ చేయవద్దని స్పష్టం చేశారు. సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ఇదివరకే రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను తమ వద్దే ఉంచుకోవాలని.. అందుకు సంబంధించి తదుపరి సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి డీలర్ల సమక్షంలో మాత్రమే బియ్యం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం జగన్ ఉన్నారు.


