అమరచింత: వరి సాగుకు అయ్యే పెట్టుబడిలో సగం ఆయిల్‌పాంపై వెచ్చిస్తే మూడేళ్లలో పంట చేతికొచ్చి అనుకున్న లాభాలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం మండలంలోని నాగల్‌కడ్మూర్ రైతువేదికలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయిల్‌పాం సాగు.. లాభాల గురించి రైతులకు వివరించారు. కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని.. సాగు విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఎక్కువ కాలం ఒకే రకమైన పంట సాగు పద్ధతికి స్వస్తి పలికి పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలని సూచించారు. దేశంలో వంటనూనెల కొరత ఉందని.. ఇతర దేశాల నుంచి ఆయిల్‌పాం దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందని తెలిపారు. దీనిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించి రాయితీలిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. నాలుగైదు నెలల్లో ఇక్కడే ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందని.. పండిన పంటను వారే కొనుగోలు చేస్తారని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వీటికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఆసక్తిగల రైతులు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,500 ఎకరాల్లో ఆయిల్‌పా సాగుకాగా.. అందులో అమరచింత మండలంలో 440 ఎకరాలు ఉండటం సంతోషకరమన్నారు. అనంతరం గ్రామంలో ఆయిల్‌పాం సాగుచేసిన రైతులు వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డితో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, తహసీల్దార్ రవియాదవ్, ఏడీఏ దామోదర్, ఏఓ అరవింద్‌తో తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పాం తోట పరిశీలన..
ఆత్మకూర్: మండలంలోని బాలకిష్టాపూర్‌లో రైతు లక్ష్మీకాంత్‌రెడ్డి 50 ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పాం తోటను కలెక్టర్ సందర్శించారు. రైతుతో మాట్లాడి పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు, పంట చేతికి ఎప్పుడొస్తుందని ఆరా తీశారు. మరో ఆరునెలల సమయం పడుతుందని.. చీడపీడల బాధలు, నిర్వహణ ఖర్చులు ఏమీ ఉండవని రైతు బదులిచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, తహసీల్దార్ చాంద్‌పాషా, ఏఓ వినయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
వరి కన్నా ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
రైతునేస్తంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి


