యాసంగి కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐకేపీ, పీఏసీఎస్, రైస్‌మిల్లుల యజమానులు, రవాణా సంస్థలతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని.. నీడ కోసం షెడ్, కూర్చోడానికి కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని, లేనిపక్షంలో కమీషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలని, రైతులందరికీ మద్దతు ధర అందేలా చూడాలని, మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని, రవాణా సంస్థలు సకాలంలో లారీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఏ గ్రేడ్ వరికి రూ.2,320, సాధారణ రకం ధాన్యానికి రూ.2,300తో పాటు సన్నరకం ధాన్యానికి బోనస్ రూ.500 ఇవ్వనున్నట్లు తెలిపారు. సన్న, దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని.. కనీసం 500 మీటర్ల దూరం ఉండాలన్నారు. సన్నరకం ధాన్యం గుర్తింపునకు కేంద్రాల నిర్వాహకులకు వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా శిక్షణ ఇప్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరం మేరకు టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే, ధాన్యం తుర్పారబెట్టే యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆలోపు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, కో–ఆపరేటివ్ అధికారి ప్రసాద్‌రావు, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్ పాల్గొన్నారు.


