రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి రూరల్: వాహన చోదకులు విధిగా రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. గురువారం మండలంలోని చందాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని తెలిపారు. బాల్యవివాహాలు, పోక్సో, మోటారు వెహికల్, బాలకార్మిక చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విధులను నిర్లక్ష్యం
చేస్తే చర్యలు
ఖిల్లాఘనపురం: గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన వారు ఉంటారని, వారికి నాణ్యమైన వైద్యం అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని.. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా మాత, శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డా. ఝాన్సీ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో ఖిల్లాఘనపురం, కమాలోద్ధీన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలు నమోదు చేసుకొని వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డా. ప్రవీణ్, డా. సురేందర్, డా. చంద్రశేఖర్, డా. జ్యోతి, హర్షిత, ఎంపీహెచ్‌ఈఓ నర్సింహులు, హెల్త్ సూపర్‌వైజర్ నర్సింహారావు, ఏఎన్‌ఎంలు, ఆయా గ్రామాల ఆశా కార్యర్తలు పాల్గొన్నారు.
రహదారి నిబంధనలు పాటించాలి


