14 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈఓ అబ్దుల్ ఘనీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. శుక్రవారం పరీక్షకు 6,853 మంది విద్యార్థులకుగాను 6,839 మంది హాజరుకాగా, 14 మంది గైర్హాజరైనట్లు వివరించారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోగా.. సిబ్బంది తనిఖీ చేసి లోనికి అనుమతించారు. అన్ని కేంద్రాల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రామన్‌పాడులో 1,017 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,017 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 165 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 16 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 57 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5 చివరి గడువని.. నిరుద్యోగ మైనార్టీ యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 వేలకు 100 శాతం, రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం, రూ.1,00,001 నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70 రాయితీ కల్పిస్తుండగా..మిగతా మొత్తం బ్యాంకు రుణం అందుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల తగిన ధ్రువపత్రాలతో tgobmms new.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
‘పంజాబ్ రైతులపై
దాడి అమానుషం’
వనపర్తి రూరల్: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. రైతులపై పంజాబ్ పోలీసుల లాఠీచార్జ్, అక్రమ అరెస్టులకు నిరసనగా శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సమన్వయ కమిటీ పిలుపు మేరకు మండలంలోని చిట్యాల మార్కెట్‌యార్డు కార్యాలయంలో రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కనీస మద్దతు ధరలు చెల్లిస్తామని బీజేపీ ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని.. దీంతో రైతులు రెండ్రోజులుగా నిరసనలు తెలియజేస్తే అక్రమంగా అరెస్టు చేసి లాఠీచార్జ్ చేయడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో పంజాబ్ రైతులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు డి.బాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, జిల్లా నాయకులు ఎం.బాలస్వామి, రైతులు వెంకటయ్య, నాగయ్య, కృష్ణయ్య, తిరుపతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
108 వాహనం తనిఖీ
చిన్నంబావి: మండలంలోని 108 వాహనాన్ని శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, వనపర్తి జిల్లా మేనేజర్ రత్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోయినా.. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్ నరేందర్, పైలెట్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.


