ఊర్కొండపేటలో కలకలం | - | Sakshi
Sakshi News home page

ఊర్కొండపేటలో కలకలం

Apr 1 2025 11:51 AM | Updated on Apr 1 2025 11:51 AM

ఊర్కొ

ఊర్కొండపేటలో కలకలం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

దాడి చేసి.. చెట్టుకు కట్టేసి

ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

గంజాయి, మద్యం మత్తులో..

జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పోలీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజాయి, మద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికై నా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.

వేగంగా విచారణ చేస్తున్నాం..

బాధితురాలి నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందిన వెంటనే ఎస్‌ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.

ఆలయానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం

ఒళ్లు జలదరించే రీతిలో

చిత్రహింసలు

జిల్లాలోని దర్శనీయ ప్రదేశాల్లో కొరవడిన భద్రత

యథేచ్ఛగా మద్యపానం,

గంజాయి వినియోగం

ఫిర్యాదులు వస్తున్నా

పట్టించుకోని వైనం

నిందితులు ఎవరైనా వదిలిపెట్టం

జడ్చర్ల టౌన్‌: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పార్టీకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరానన్నారు.

ఊర్కొండపేటలో కలకలం 1
1/1

ఊర్కొండపేటలో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement