న్యాయవాద వృత్తి పవిత్రమైంది
వనపర్తి టౌన్: న్యాయవాద వృత్తి పవిత్రమైందని.. న్యాయవాదులు అంకితభావంతో పని చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. మంగళవారం రాత్రి జిల్లా కోర్టు సముదాయం ఆవరణలో వనపర్తి బార్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదులు న్యాయపరమైన పుస్తకాలు చదవడం, అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జూనియర్ న్యాయవాదులు న్యాయస్థానాలకు క్రమం తప్పకుండా హాజరైతే కేసుల పరిశీలనకు అవకాశం ఉంటుందని.. సీనియర్లు విలువైన సూచనలు, సలహాలు అందించేందుకు అవకాశం లభిస్తుందని వివరించారు. న్యాయవాదులకు అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు న్యాయవాద వృత్తి అరుదైన అవకాశం అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్‌గౌడ్, సభ్యుడు కొండారెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులకు రిటైర్మెంట్ లేదని, జీవితాంతం వకాలత్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రజని, కవిత, రవికుమార్, శ్రీలత, జానకి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ఎన్నికల నిర్వహణ అధికారులు మోహన్‌గౌడ్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉల్లి బహిరంగ వేలం
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు రావడం వల్ల శనివారం నుంచి మంగళవారం వరకు లావాదేవీలు జరగలేదు. తిరిగి బుధవారం మార్కెట్‌లో లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఉల్లి వేలం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ధాన్యం టెండర్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


